Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 50

Janaka receives Viswamitra in Mithila !!

తతః ప్రాగుత్తరాం గత్వా రామస్సౌమిత్రిణా సహ |
విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞ వాటం ఉపాగమత్ ||

'అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని వెంట ఈశాన్యదిశగా ప్రయాణముచేసి యజ్ఞశాలకి చేరిరి'.

బాలకాండ
ఏబదియవ సర్గము
( విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలానగరము ప్రవేశించుట)

పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి విశ్వామిత్రుని వెంట ఈశాన్యదిశగా ప్రయాణముచేసి యజ్ఞశాలకి చేరిరి. అప్పుడు లక్ష్మణునితో కూడిన రాముడు మునిశార్దూలమైన విశ్వామిత్రునితో ఇట్లు చెప్పెను." మహాత్ముడైన జనకుని యజ్ఞశాల సమృద్ధిగానున్నది. ఇచ్చట వెలకొలదీ అన్నిదేశములనుంచి మహాపండితులైన వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణులు కలరు. ఓ బ్రహ్మన్ ! అనేక ఋషినివాసములు వందలకొలదీ శకటములూ కనపడుచున్నవి. మనము ఏ ప్రదేశములో వుండవలెనో మీరు నిర్ణయింపుడు".

మహాముని అయిన విశ్వామిత్రుడు రాముని వచనములను విని జలసౌకర్యము గల ప్రశాంతమైన ప్రదేశమును తమ నివాసముగా చేసెను. జనక రాజు కూడా విశ్వామిత్రుడు వచ్చెనని విని, వినయముతో తమ పురోహితుడగు శతానందుని తీసుకొని త్వరగా అచటికి వచ్చెను. ఋత్విజులు కూడా వెంటనే అర్గ్యము తీసుకువచ్చి ధర్మయుక్తముగా మంత్రములతో మహాత్ముడగు విశ్వామిత్రునకు సమర్పించిరి.

విశ్వామిత్రుడు మహాత్ముడైన జనకుని పూజలు ప్రతిగ్రహించి ఆ రాజుని కుశలములను నిరాటంకముగా జరుగుచున్న యజ్ఞముని గురించి అడిగెను. పిమ్మట ఆ మునులను కూడా యథావిథిగా కుశలములు అడిగి అప్పుడు ఆ పురోహితులతో సంతోషముగా కలిసి వెళ్ళెను. అప్పుడు రాజు అంజలి ఘటించి ఆ మునిశ్రేష్ఠునితో ఇట్లు పలికెను. " ఓ భగవన్ ! ఆ ముని పుంగవులతో కలిసి ఆసనమును అలంకరించుడు."

ఆ మహాముని జనకుని వచనములను విని ఆసనము స్వీకరించెను. జనకమహారాజు కూడా పురోహితులు ఋత్విజులు మంత్రులతో ఉపవిష్టుడాయెను. ఆసనములలో యథావిథముగా కూర్చునిన వారిని చూచి జనకమహారాజు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. "దేవానుగ్రహము వలన ఈ దినము యజ్ఞమునకు సమృద్ధి కలిగినది. సఫలము కూడా అయినది. నేడు భగవత్ సత్తములైన మీ దర్శనముచే యజ్ఞఫలము లభించినది. హే బ్రహ్మన్ ! యజ్ఞోపసదనమునకు మునులతో సహా మునిపుంగవులు రావుట వలన నేను ధన్యుడనైతిని. అనుగ్రహింపబడిన వాడనైతిని. ఓ బ్రహ్మర్షీ ఇంకా పన్నెండు రోజులు మిగిలినవి . అప్పుడు యాజ్ఞభాగములను తీసుకొను దేవతలను మీరు చూచెదరు గాక."

ఆ మునిశార్దూలముతో ఇట్లుపలికి ఆ రాజు సంతోషముతో ప్రాంజలిఘటించి మరల ఇట్లు అడిగెను.

"మీకు క్షేమమగుగాక. ఈ కుమారులిద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, శార్దూలము వృషభము పోలిన వారు, గతిలో గజ సింహములను పోలినవారు , పద్మపత్రము వంటి విశాలమైన కన్నులు గలవారు ,ఖడ్గము తూణీరము ధనస్సు ధరించినవారు, రూపములో అశ్వినీ దేవతలను పోలినవారు, యౌవ్వనమునకు తగిన వయస్సు గలవారు. అదృష్టవసాత్తు దేవలోకమునుంచి వచ్చిన అమరులు వలె నున్నవారు. ఓ మహామునీ పాదనడకలతో ఏట్లు వచ్చిరి ? ఎందుకు వచ్చిరి ? ఓ మహామునీ ! శ్రేష్టమైన ఆయుధములను ధరించి వచ్చిన వీరులు ఎవరి పుత్రులు ? సూర్యచంద్రులు ఆకాశమును అలంకరించినట్లు వీరు ఈ దేశమునకు అలంకారమువలె నున్నవారు. ప్రామాణమునందు, చేష్టలలోను రూపములోనూ వీరు ఒకరినొకరు పోలి యున్నారు. జూలుపాలతో యున్న వీరిగురించి వినుటకు నేను కోరుచున్నాను|

మహాత్ముడగు జనకుని ఆ వచనములను విని విశ్వామిత్రుడు అ మహాత్ములిద్దరూ దశరథుని పుత్రులని నివేదించెను. వారు సిద్ధాశ్రమములోనివశించుట, రాక్షసులవథ, విశాలనగర దర్శనము అచటి నుండి వచ్చుట, అహల్యా దర్శనము, గౌతమ మహాముని తో సంగమము , ఆ మహధనస్సుగురించి తెలిసుకొనుటకు ఆశక్తి తో ఇచటికిరావడము గురించి విశ్వామిత్రుడు చెప్పెను

ఇవన్నీ మహాతేజోవంతుడగు జనకునికి చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు విరమించెను.

||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో ఏబదియవ సర్గము సమాప్తము||

||ఓమ్ తత్ సత్||

ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే |
నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహామునిః ||

తా|| ఇవన్నీ మహాతేజోవంతుడగు జనకునికి చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు విరమించెను.

|| om tat sat ||